పిల్లలు ఫోన్ చూస్తూ తింటున్నప్పుడు వారి దృష్టి మొత్తం స్క్రీన్‌పైనే ఉంటుంది. దీనివల్ల వారు ఆహారాన్ని సరిగ్గా నమలకుండానే పెద్ద ముద్దలను మింగేస్తారు. ఇలా నమలకుండా ఆహారం తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయని ఉజాలా సిగ్నస్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ శుచిన్ బజాజ్ తెలిపారు.

సాధారణంగా కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి కొంత సమయం పడుతుంది. అయితే, ఫోన్‌లోని రీల్స్, షార్ట్స్ చూస్తూ మెదడు నిమగ్నమై ఉండటంతో, కడుపు నిండిన విషయాన్ని శరీరం గుర్తించలేదు. ఫలితంగా పిల్లలు అవసరానికి మించి ఎక్కువగా తింటారు.

ఫోన్ చూస్తూ చిప్స్, బిస్కెట్లు వంటి ప్యాక్ చేసిన అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు అంటే యంత్రాల ద్వారా శుద్ధి చేసి నిల్వ ఉంచిన పదార్థాలు తినడం వల్ల శరీరంలో క్యాలరీలు వేగంగా పెరుగుతాయి. ఇది బాల్య ఊబకాయం, తీవ్రమైన మలబద్ధకం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

వీడియోలు చూస్తున్నప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. దీనివల్ల ప్రతిసారీ కొత్త కంటెంట్ చూడాలనే కోరిక పెరిగి పిల్లలు ఫోన్‌కు బానిసలవుతున్నారు. ఆహారాన్ని రుచి చూస్తూ, ఏకాగ్రతతో తినే పద్ధతిని పిల్లలకు నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యతని వైద్యులు గుర్తుచేస్తున్నారు.