వినాయక చవితి పండుగ వేళ బెల్లం ధర అమాంతంగా పెరిగింది. గతంలో కిలో రూ.45 ఉన్న బెల్లం ధర ప్రస్తుతం రూ.80కి చేరుకుంది. దీంతో వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములు తయారు చేయడం సామాన్యులకు భారంగా మారింది.

కేవలం బెల్లమే కాకుండా పప్పులు, నూనెల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. బెల్లానికి ప్రత్యామ్నాయంగా పంచదారతో నైవేద్యం చేద్దామంటే, దాని ధర కూడా కిలో రూ.75గా ఉంది. కందిపప్పు ధర కిలో రూ.140 దాటింది.

ఈ ధరల పెరుగుదలపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పండుగ సమయాల్లో రేషన్ దుకాణాల ద్వారా బెల్లం, పంచదార, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందించేది. ఇప్పుడు ఆ సదుపాయం లేకపోవడంతో పాటు, ఇంటికి అందే ఆర్థిక సాయం కూడా నిలిచిపోయింది.

వర్షాలు లేకపోవడం, వరినాట్లు సరిగ్గా పడకపోవడం వల్ల రైతులు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు. ఎరువుల కొరత, వాటి ధరలు పెరగడం వంటి సమస్యలు తోడయ్యాయి. బియ్యం ధర కూడా కిలో రూ.60 నుంచి రూ.70 వరకు ఉండటంతో, కనీసం బియ్యం పిండితో ఉండ్రాళ్లు చేయడం కూడా కష్టంగా మారిందని భక్తులు చెబుతున్నారు.

ఈ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో, తమకు ఆర్థిక భరోసా కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ధరల భారం నుంచి ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం కొత్త ఆసరా కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.