ఇతరులు తాగే సిగరెట్ల నుంచి వచ్చే పొగను పీల్చడాన్ని పాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. ఈ అలవాటు లేని వారు కూడా ఇతరుల పొగ వల్ల అనారోగ్యానికి గురవుతుండటంతో భారత్‌లో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 1990లో దేశవ్యాప్తంగా 2,17,700 మంది ఈ కారణంగా చనిపోగా, 2023 నాటికి ఆ సంఖ్య 3,25,600కు చేరిందని తాజా నివేదిక పేర్కొంది.
'గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2023 సెకండ్-హ్యాండ్ స్మోక్ కొలాబొరేటర్స్' అనే అంతర్జాతీయ పరిశోధకుల బృందం 204 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 2023లో 271 కోట్ల మంది ప్రజలు ఈ పొగ ప్రభావానికి గురయ్యారు. వీరిలో 14 ఏళ్ల లోపు పిల్లలే 76.7 కోట్ల మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పాసివ్ స్మోకింగ్ ప్రభావానికి గురవుతున్న వారిలో సగం మంది చైనా, భారత్, ఇండోనేషియా దేశాల్లోనే ఉన్నారు. 2023 లెక్కల ప్రకారం చైనాలో 66.4 కోట్లు, భారత్‌లో 44.4 కోట్లు, ఇండోనేషియాలో 14.2 కోట్ల మంది ఈ పొగను పీలుస్తున్నారు. భారత్‌లో 1990లో 37.5 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య, 2023 నాటికి 18.4 శాతం పెరిగి 44.4 కోట్లకు చేరుకుంది.
కొన్ని దేశాల్లో పురుషుల కంటే మహిళలు 1.8 రెట్లు ఎక్కువగా ఈ పొగ ప్రభావానికి గురవుతున్నారని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 12 శాతం మంది పిల్లలు సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే, మొత్తం జనాభాతో పోలిస్తే ప్రతి లక్ష మందికి సంభవించే మరణాల రేటు మాత్రం 1990లో 46.1 శాతం ఉండగా, 2023 నాటికి 30 శాతానికి తగ్గిందని నివేదిక తెలిపింది.








