విజయవాడ, ఆంధ్రప్రభ: జూనియర్‌ వైద్యులు 16 రోజులుగా సమ్మె చేస్తున్నా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదని వైఎస్‌ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యుడు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ అన్నారు. పేద ప్రజల ఆరోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యాన్ని చాటుకుందని విమర్శించారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం, 104 సేవలకు మంగళం పాడడం, వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకపోవడంతో వైద్య, ఆరోగ్య రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన పది ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడం ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలను దూరం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో పేదలకు అందుతున్న అరకొర వైద్య సేవలకు కూడా జూనియర్‌ వైద్యుల సమ్మెతో ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొందన్నారు. 16 రోజులుగా సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం సరికాదన్నారు. పీజీ వైద్యులు అందిస్తున్న సేవలు, వారి పని గంటలు, పెరుగుతున్న జీవన వ్యయాలను పరిగణనలోకి తీసుకుని వారు కోరుతున్న మేరకు స్టైపెండ్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు.

సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా వైద్యులను నియమించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని మెహబూబ్‌ షేక్‌ అన్నారు. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జూనియర్‌ వైద్యుల స్టైపెండ్‌ను 42.4 శాతం పెంచిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇంటర్న్‌లకు 15 శాతం, పీజీ వైద్యులకు కేవలం 3 శాతం పెంచుతామని చెప్పడం ద్వారా వైద్య రంగంపై తన చిత్తశుద్ధిని చాటుకుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, జూనియర్‌ వైద్యులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమ్మెను విరమింపజేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.