ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాటియాలా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. పాటియాలా బ్యాటర్లు విహాన్ మల్హోత్రా 140 పరుగులు, అన్మోల్‌ప్రీత్ సింగ్ 115 పరుగులతో రాణించగా, బటిండా బౌలర్ ఆకాష్ పాండే 5 వికెట్లు తీశాడు.
భారీ లక్ష్య ఛేదనలో భారత అండర్-19 మాజీ కెప్టెన్ ఉదయ్ సహారన్ అద్భుతమైన ఆటతీరుతో బటిండాను గెలిపించాడు. సహారన్ 149 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్సర్లతో 214 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో బటిండా మరో ఓవర్ మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఈ టోర్నీలో సహారన్ 5 మ్యాచ్‌ల్లో 150.25 సగటుతో 601 పరుగులు చేసి టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. 2024 అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సహారన్, 2025-2026 రంజీ ట్రోఫీలో కూడా పంజాబ్ తరపున 655 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు.
ఈ ప్రదర్శనతో ఈ ఏడాది చివరలో జరగనున్న ఐపీఎల్-2027 మినీ వేలంలో సహారన్‌కు భారీ ధర పలికే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ నుంచి ఇప్పటికే అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండగా, ఇప్పుడు సహారన్ భారత సీనియర్ జట్టులోకి ప్రవేశించే దిశగా అడుగులు వేస్తున్నాడు.








