పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి స్కీమ్ పరిధిలోకి మార్చడంపై వస్తున్న ఆందోళనలపై మంత్రి వివేక్ గురువారం సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలు నేర్పించి, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.97 ద్వారా పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి రానున్నాయి. అయితే, ఈ విలీనం వల్ల తమ మూడేళ్ల డిప్లొమా కోర్సు విలువ తగ్గుతుందని, భవిష్యత్తులో బీటెక్ రెండో సంవత్సరంలో నేరుగా చేరే అవకాశం కోల్పోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

విద్యార్థుల భయాందోళనలను మంత్రి కొట్టిపారేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు TG ECET (ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష) ద్వారా బీటెక్ రెండో సంవత్సరంలో చేరే అవకాశం యథాతథంగా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఫీజుల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని, ప్రస్తుతం ఉన్న విధివిధానాలే కొనసాగుతాయని ఆయన చెప్పారు.

పాలిటెక్నిక్ లెక్చరర్ల సర్వీస్ రూల్స్ (ఉద్యోగ నిబంధనలు) మారవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి వివేక్ భరోసా ఇచ్చారు. పాలిటెక్నిక్ భూములను ప్రభుత్వం అమ్ముతుందనే ప్రచారం అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.

ఈ విషయంలో ప్రతిపక్షాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నేతల మాటలను నమ్మవద్దని ఆయన విద్యార్థులకు సూచించారు.