ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్ మంగళవారం స్పందించారు. కాంగ్రెస్ తన అధికార కాలంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్లకు (CEC) పద్మ అవార్డుల రూపంలో లంచాలు ఇచ్చిందని పీయూష్ గోయల్ ఆరోపించారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న వారికి పదవులు కట్టబెట్టిందని గోయల్ విమర్శించారు. మాజీ CEC టిఎన్ శేషన్‌ను ఎల్‌కే అద్వానీకి వ్యతిరేకంగా పోటీకి నిలబెట్టారని, మాజీ CEC ఎంఎస్ గిల్‌కు పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు, 1986లో ఆర్కే త్రివేదిని గుజరాత్ గవర్నర్‌గా నియమించారని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2023లో కొత్త ఎన్నికల చట్టాన్ని తీసుకువచ్చిందని గోయల్ వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో ప్రతిపక్ష నాయకుడు కూడా సభ్యుడిగా ఉంటారని ఆయన వివరించారు. మోడీ ఆధ్వర్యంలోని ఎన్నికల కమిషనర్లు స్వతంత్రంగా పనిచేస్తున్నారని ఆయన కితాబు ఇచ్చారు.

రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు ఓటు చోరీ జరిగి ఉంటే, ఆయన ఎందుకు ఎన్నికల కమిషన్ కోర్టుకు సాక్ష్యాలు సమర్పించలేదని గోయల్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని, పిల్లచేష్టలను గత కొన్ని రోజులుగా చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు, రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ.. ఓటు చోరీ ఆరోపణలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ సంస్థలకు హాని కలిగిస్తాయని హెచ్చరించారు. రాహుల్ తన నాన్నమ్మ ఇందిరా గాంధీలాగే పదవి కోసం రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అరాచకాన్ని వ్యాపింప చేయడం ప్రతిపక్షం పని కాదని ఆయన విమర్శించారు.