నీట్ (NEET) పరీక్షా పత్రాల లీక్ అంశంపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతమైన చర్చ జరగాలని ప్రతిపక్షాలను కోరారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని వాడుకుంటున్నాయని నడ్డా ఆరోపించారు. గత పదేళ్లలో 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీ ఎందుకు ఏకపక్షంగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
విద్యార్థుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నడ్డా స్పష్టం చేశారు. పేపర్ లీక్‌లపై వస్తున్న ప్రతి ఆరోపణను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, అవసరమైన చోట విచారణ కొనసాగుతోందని ఆయన వివరించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెట్టి నిర్మాణాత్మక చర్చ జరపాలని ఆయన కోరారు.







