నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరసన చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న శాంతియుత నిరసనలకు మద్దతుగా ఆయన ఈ ఆందోళనలో పాల్గొన్నారు. జంతర్ మంతర్, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి, ఆ తర్వాత మేదాంత ఆస్పత్రిలో ఆయన 26 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు.

ఈ నిరసనల నేపథ్యంలో మూడేళ్ల క్రితం నాటి ఒక ఫొటో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2023 మార్చిలో విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం కృషి చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్, ఆయన భార్య అన్మోగ్ గీతాంజలిని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా అభినందించారు. జాతీయ విద్యా విధానం (NEP) - 2020ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అప్పట్లో సోనమ్ మంత్రిని కోరారు. అప్పుడు మంత్రిని ప్రశంసించిన సోనమ్, ఇప్పుడు అదే మంత్రి రాజీనామా కోసం దీక్షకు దిగడం గమనార్హం.

మే 3న జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, మే 21న పరీక్ష రద్దు వంటి పరిణామాలతో సోనమ్ వాంగ్‌చుక్ విద్యార్థుల పక్షాన నిలబడ్డారు. మొదట్లో మంత్రి రాజీనామాను పట్టుబట్టినప్పటికీ, చివరకు పార్లమెంట్‌లో చర్చ, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఇచ్చిన హామీలతో ఆయన దీక్షను విరమించారు.

సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష ముగిసినా, నీట్ బాధితులు, జెన్‌జీలు మాత్రం తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మంత్రి రాజీనామా డిమాండ్‌ను వదిలేయకూడదని, తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని వారు నిర్ణయించుకున్నారు.