నీట్ (NEET) స్కాంపై యువత చేస్తున్న పోరాటానికి మద్దతుగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలిచారని, దీనిని ఓర్వలేకనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మన్నె క్రిశాంక్ విమర్శించారు. ప్రభుత్వంపై ఎవరు ప్రశ్నలు సంధించినా కేటీఆర్ పేరును తెరపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బండి సంజయ్, రేవంత్ రెడ్డి మంచి మిత్రులని, బండి సంజయ్ కుమారుడిపై నమోదైన బాలల లైంగిక నేరాల చట్టం (POCSO) కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొమ్మిది రోజుల పాటు రక్షణ కల్పించిందని క్రిశాంక్ ఆరోపించారు. ప్రస్తుతం ఆ కేసులో నిందితుడికి బెయిల్ కూడా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో గ్రూప్-1 పేపర్ లీక్ అయితే, అప్పటి ప్రభుత్వం బాధ్యులను గుర్తించి జైలుకు పంపిందని, కానీ ఏడేళ్లుగా ఒకే అబద్ధాన్ని ఈ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీదని జరుగుతున్న ప్రచారాన్ని క్రిశాంక్ ఖండించారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జేఎన్టీయూ కాకినాడ ఈ సంస్థకు కాంట్రాక్టులు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఐటీ సమ్మిట్‌కు గ్లోబరీనా స్పాన్సర్‌గా వ్యవహరించిందని, బీజేపీ మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం ఈ సంస్థకు అవార్డు ఇచ్చారని ఆయన వివరించారు.
నీట్ ఉద్యమం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బండి సంజయ్, రేవంత్ రెడ్డి కలిసి కేటీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని క్రిశాంక్ ఆరోపించారు. కేటీఆర్ బినామీ సంస్థ అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాంట్రాక్టులు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.








