దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి నిరసనల నేపథ్యంలో, ఆందోళనకారులకు అండగా నిలిచేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. నిరసనల సమయంలో నమోదైన తప్పుడు కేసులను ఎదుర్కొంటున్న వారికి న్యాయపరమైన మద్దతు అందించడమే ఈ వేదిక ప్రధాన ఉద్దేశమని పార్టీ ప్రతినిధులు తెలిపారు.
రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌తో కలిసి సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడైనా నిరసనకారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే, ఆ వివరాలను ట్రాక్ చేస్తారు. అంతేకాకుండా, బాధితులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న న్యాయవాదులను, ఈ వెబ్‌సైట్ ద్వారా బాధితులతో అనుసంధానం చేస్తారు. న్యాయవాదులు తమ వివరాలను ఈ వేదికపై నమోదు చేసుకోవచ్చని వారు స్పష్టం చేశారు.
ఈ న్యాయ పోరాటాన్ని బలోపేతం చేసేందుకు కపిల్ సిబల్ వ్యక్తిగతంగా రూ. కోటి రూపాయల నిధిని విరాళంగా ప్రకటించారు. శాంతియుత ఆందోళనకారులపై బనాయించే తప్పుడు కేసులను ఎదుర్కోవడానికి ప్రజలు, న్యాయవాదులు తమకు తోచినంత విరాళం అందించాలని ఆయన కోరారు. ఈ నిధుల నిర్వహణ బాధ్యతను పూర్తిగా సీజేపీ చూసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.







