ఉదయం అలారం ఆపగానే ఫోన్ చేతిలోకి తీసుకోవడం, రాత్రి పడుకునే ముందు రీల్స్ చూస్తూ గంటల సమయం గడపడం ఇప్పుడు చాలామందిలో కనిపిస్తున్న డిజిటల్ అలవాటు. ఇలా స్క్రీన్ వినియోగం పెరగడం వల్ల నిద్ర, ఏకాగ్రత, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర లేవగానే ఫోన్ చూడటం వల్ల మెసేజ్‌లు, ఈమెయిల్స్, వార్తలు మన దృష్టిని మళ్లిస్తాయి. ముఖ్యంగా పనికి సంబంధించిన సందేశాలు లేదా ప్రతికూల వార్తలు కనిపిస్తే, రోజును ప్రశాంతంగా ప్రారంభించడానికి బదులుగా ఒత్తిడితో మొదలుపెట్టే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఫోన్ చేతిలోకి తీసుకుంటే, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే షార్ట్ వీడియోల వల్ల సమయం తెలియకుండానే గడిచిపోతుంది.
మెదడులోని నాడీకణాల మధ్య సమాచార ప్రసారంలో కీలక పాత్ర పోషించే డోపమైన్ అనే రసాయనం ఈ అలవాట్లకు ప్రధాన కారణం. మనకు ఆసక్తికరంగా అనిపించే రివార్డులు లభించినప్పుడు ఈ వ్యవస్థ పనిచేస్తుంది. సోషల్ మీడియా లైక్‌లు, కొత్త నోటిఫికేషన్లు, షార్ట్ వీడియోలు వంటి తక్షణ రివార్డులు పదేపదే అందుబాటులో ఉండటం వల్ల, వాటిని మళ్లీ మళ్లీ చూడాలనే ప్రేరణ కలుగుతుంది.
షార్ట్ వీడియో యాప్స్‌లో ఒక వీడియో పూర్తికాగానే మరొకటి సిద్ధంగా ఉండటం వల్ల, మనం వెతకాల్సిన అవసరం లేకుండానే కొత్త కంటెంట్ అందుతుంది. దీనివల్ల ఐదు నిమిషాల కోసం మొదలైన స్క్రోలింగ్ గంటల వరకు సాగుతుంది. ఫలితంగా రోజువారీ పనులు, చదువు, వ్యాయామం, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోవచ్చు.
నిద్రకు ముందు ఫోన్ చూడటం వల్ల నిద్ర సమయం తగ్గి, మరుసటి రోజు అలసట, చిరాకు వంటి సమస్యలు రావచ్చు. సోషల్ మీడియాలో ఇతరుల జీవనశైలిని చూసి తమ జీవితంతో పోల్చుకోవడం వల్ల కొందరిలో అసంతృప్తి పెరగవచ్చు. రాత్రి ఫోన్‌ను మంచానికి దూరంగా ఉంచడం, ‘డు నాట్ డిస్టర్బ్’ మోడ్ ఉపయోగించడం ద్వారా ఈ అంతరాయాలను తగ్గించుకోవచ్చు.
టెక్నాలజీని పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు, కానీ దానితో సమతుల్యత సాధించడం ముఖ్యం. ఉదయం మొదటి 30 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండటం, అలారం కోసం సాధారణ గడియారం వాడటం, అనవసరమైన యాప్ నోటిఫికేషన్లు ఆపివేయడం వంటి మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.








