నేపాల్‌లోని త్రిశూలీ లోయలో ఉన్న త్రిభువన్ త్రిశూలీ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్ర దవాడీకి బుధవారం ఉదయం 9.20 గంటలకు ఒక స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. గ్రామం మొత్తం నదిలో కలిసిపోయిందని, వెంటనే అప్రమత్తం కావాలని ఆ స్నేహితుడు హెచ్చరించాడు. ఆ సమయంలో పాఠశాలలో 1,643 మంది విద్యార్థులు ఉన్నారు. హిమనదం కూలిపోవడంతో రాళ్లు, మంచు, బురదతో కూడిన వరద ప్రవాహం గ్రామాలపైకి దూసుకొచ్చింది.
ప్రారంభంలో పాఠశాల భవనం సురక్షితంగా ఉంటుందని భావించినప్పటికీ, ఒక విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి నీటిమట్టం వేగంగా పెరుగుతోందని చెప్పడంతో దవాడీ వెంటనే స్పందించారు. పాఠశాల గంట మోగించి విద్యార్థులను బయటకు పంపాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. స్కూల్ బస్సులను వెనక్కి తిప్పాలని డ్రైవర్లకు సూచించారు. విద్యార్థులందరూ కాలినడకన సురక్షిత ప్రాంతానికి చేరుకుని ఒక బోధి చెట్టు కింద ఆశ్రయం పొందారు. కొద్దిసేపటికే పాఠశాల భవనం పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది.
ఈ ఘటనలో విద్యార్థులందరూ క్షేమంగా బయటపడినప్పటికీ, సామాజిక చరిత్ర ఉపాధ్యాయుడు సంతోష్ పరిహార్, శానిటేషన్ సిబ్బంది సుల్తాన్ లామా వరదల్లో చిక్కుకుని మరణించారు. లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో మంచు, రాళ్లు విరిగిపడటంతో ఈ ఆకస్మిక వరద సంభవించిందని నిపుణులు తెలిపారు. 2015 భూకంపం తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన మరో భారీ విషాదంగా దీనిని పేర్కొన్నారు.
ప్రస్తుతం పాఠశాల ఉన్న ప్రాంతం బురద, శిథిలాలతో నిండిపోయింది. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన రాజేంద్ర దవాడీని స్థానికులు హీరోగా కొనియాడుతున్నారు. అయితే, తాను చేయగలిగింది మాత్రమే చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.








