స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను అంగీకరించేది లేదని, ఒకవేళ జరిగితే అందుకు నియోజకవర్గ ఇన్చార్జ్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇన్చార్జ్‌లతో జరిగిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికార పార్టీ పట్టు, తమపై ఉన్న కేసులు, బలహీనపడిన కేడర్ నేపథ్యంలో అధినేత వార్నింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇన్చార్జ్‌లు సతమతమవుతున్నారు.
నెల్లూరు జిల్లాలో గతంలో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం టీడీపీ ఆధిపత్యం పెరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు సూచనల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గరిష్టంగా ఏకగ్రీవాలు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. కావలి, ఉదయగిరి, గూడూరు, సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గూడూరుకు కొత్తగా నియమితులైన ఇన్చార్జ్ ఈ పరిణామాల పట్ల మరింత ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరియు వారి అనుచరులపై కేసులు నమోదయ్యాయి. గతంలో వాలంటీర్లకు ప్రాధాన్యత ఇచ్చి, క్షేత్రస్థాయి నేతలను విస్మరించడం వల్ల పార్టీ దెబ్బతిందని మాజీ నేతలు భావిస్తున్నారు. పోలీసు కేసులు, అధికార పార్టీ ఒత్తిడిని తట్టుకుని ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడం సాధ్యమేనా అన్న చర్చ పార్టీలో సాగుతోంది.
అటు అధినేత హెచ్చరికలు, ఇటు అధికార పార్టీ దూకుడుతో నెల్లూరు వైసీపీ నేతలు ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులను ఎదుర్కోవడం కష్టమని భావిస్తున్న ఇన్చార్జ్‌లు, రాబోయే ఎన్నికల్లో తమ వ్యూహాలను ఎలా అమలు చేయాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు.







