హర్మూజ్ జలసంధిలో అమెరికాకు చెందిన నౌకలపై ఇరాన్ ఏ రకమైన ఆయుధాలతో దాడి చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. క్షిపణులు, రాకెట్లు లేదా డ్రోన్లతో దాడి జరిగితే, అందుకు ప్రతిగా ఇరాన్‌లోని వంతెనలు లేదా విద్యుత్ కేంద్రాలపై బాంబులతో దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టెహ్రాన్ నగరం లేదా దాని సమీప ప్రాంతాల్లో కూడా దాడులు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు పోరాడుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ సైతం జోర్డాన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.

మరోవైపు, ఇరాన్ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలపై అంతర్జాతీయ న్యాయనిపుణులు స్పందించారు. పౌర లక్ష్యాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని వారు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించడంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.