నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశ దిన కర్మ సందర్భంగా సోమవారం నల్లబెల్లి మండల కేంద్రంలో సంతాప సభ జరిగింది. ఈ సభకు హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్, సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సుదర్శన్‌రెడ్డి ప్రజాదరణను గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి లేదా మంత్రి కాకపోయినా, కేవలం ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయనకు లభించిన ప్రజాభిమానం అరుదైనదని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు.
సుదర్శన్‌రెడ్డి అంతిమ యాత్రకు ఆహ్వానం లేకుండానే లక్ష మందికిపైగా ప్రజలు తరలివచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. వర్షం పడుతున్నా, అనేక ఇబ్బందులు ఉన్నా దాదాపు 12 గంటల పాటు ప్రజలు అంతిమ యాత్రలో పాల్గొనడం ఆయన పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమని చెప్పారు. ఎంతకాలం బతికామన్నది కాకుండా, ఎలా బతికామన్నదే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజలకు పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా, నర్సంపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టేందుకు కృషి చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు, వచ్చే రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.








