కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పట్టణంలోని 16వ వార్డులో 'నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

పట్టణంలో ఎదురవుతున్న విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ మరియు పారిశుధ్య సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, డీఈ నాసిర్, ఏఈ దినేష్‌లను ఆయన ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. 2014 టీడీపీ ప్రభుత్వంలో మాండ్ర శివానందరెడ్డి చొరవతో రోడ్డు వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వైసీపీ ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని ఆరోపించారు. ప్రస్తుతం ఎస్టీ ప్లాన్ కింద డ్రైనేజీ పనులను పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రోజుకు 300 రూపాయల చొప్పున నెలకు 15,000 రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, అభివృద్ధి మాత్రమే ప్రజల మదిలో నిలిచిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.