బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీ, శనివారం సాయంత్రంలోగా తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కమిటీ ఆ నోటీసులో పేర్కొంది.

ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో, ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైపు కౌశిక్ రెడ్డి చేతులతో తుపాకిలా గురి పెట్టారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా, బిఆర్‌ఎస్ సభ్యులు నిరసనలతో సభను స్తంభింపజేశారు.

సభలో జరిగిన ఈ గందరగోళం నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే, అప్పటికి ఆ కమిటీ ఏర్పాటు కాలేదు. తాజాగా రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ, వివిధ పార్టీల సభ్యులతో స్పీకర్ కమిటీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు.

నాలుగు రోజుల క్రితం రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిటీ, కౌశిక్ రెడ్డికి నోటీసు పంపి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. ఆయన ఇచ్చే సమాధానంపై కమిటీ సభ్యులు సమావేశమై చర్చిస్తారు.

ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమయం తక్కువగా ఉన్నందున, ఈ సమావేశాల్లోనే కమిటీ నివేదికను స్పీకర్‌కు అందజేసి, దానిని సభలో ప్రతిపాదించడం సాధ్యమవుతుందా అని ఎమ్మెల్యేలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.