కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి చేసిన తొలి చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, అమెరికాలో కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్ల వసూళ్లను సాధించిందని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవల 'కరుప్పు' సినిమాతో విజయాన్ని అందుకున్న సూర్య, ఈ చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మాస్ యాక్షన్ సినిమాల నుంచి భిన్నంగా, ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సూర్య ప్రేక్షకులను అలరిస్తున్నారు.
సూర్య ఇమేజ్‌కు తగినట్లుగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించడం ఈ సినిమాకు కలిసొచ్చింది. ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు నటించగా, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, నాజర్, సునీల్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించగా, జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
సినిమా రెండో వారంలో కూడా ఇదే స్థాయిలో వసూళ్లు కొనసాగితే, బ్రేక్ ఈవెన్ (పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే స్థాయి) దిశగా దూసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్లాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కూడా సూర్య సత్తా చాటగలరని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ఆగస్టు 21న టాలీవుడ్ నటుడు రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా విడుదల కానుంది. ఈ కొత్త సినిమా నుంచి 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు ఎలాంటి పోటీ ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








