గడిచిన నాలుగేళ్లలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికైన 111 మంది ప్రజాప్రతినిధులు తమ పార్టీలను మార్చారు. ఇందులో 26 మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. పార్టీలు మారిన వారిలో అత్యధికంగా నాగాలాండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నేతలు ఉన్నారు.
నాగాలాండ్‌లో అత్యధికంగా 32 ఫిరాయింపులు జరిగాయి. అక్కడ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP), నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) మధ్య రాజకీయ సమీకరణాల వల్ల ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో 20 మంది లోక్‌సభ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో చేరారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 9 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరగా, మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన ఎంపీలు ఏక్‌నాథ్ షిండే శివసేనలోకి మారారు. మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, సిక్కిం, యూపీ రాష్ట్రాల్లో కూడా ఫిరాయింపులు నమోదయ్యాయి.
పార్టీల వారీగా చూస్తే NDPP నుంచి 25 మంది, టీఎంసీ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి 19 మంది బయటకు వెళ్లారు. మొత్తంగా 111 కేసులలో 64 కేసులు ఈ మూడు పార్టీల నుంచే నమోదయ్యాయి. ఫిరాయింపుదారులను చేర్చుకోవడంలో NPF అత్యధికంగా 32 మందిని, బీజేపీ 29 మందిని, NCPI 20 మందిని తమ పార్టీల్లోకి తీసుకున్నాయి.
కొన్ని రాష్ట్రాల శాసనసభలలో ప్రభుత్వాలు పడిపోవడానికి ఈ ఫిరాయింపులు ఒక కారణమని ఏడీఆర్ తన నివేదికలో విశ్లేషించింది. ప్రజాప్రతినిధుల ఇటువంటి వరుస మార్పులు రాజకీయ స్థిరత్వంపై ప్రభావం చూపుతున్నాయని సంస్థ పేర్కొంది.








