హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు దేశంలో ఎక్కడైనా న్యాయవాదులుగా నమోదు చేసుకోవచ్చని న్యాయవిద్యను నియంత్రించే సంస్థ అయిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ప్రకటించింది. నల్సార్ కాన్వకేషన్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తొలుత 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై BCI నిషేధం విధించింది.
అయితే, ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే BCI తన ఆదేశాలను ఉపసంహరించుకుంది. 2026 బ్యాచ్‌లో అత్యధిక మంది విద్యార్థులు అమాయకులని, వారి తప్పేమీ లేదని BCI చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. విద్యార్థులను కొంతమంది ఉద్దేశపూర్వకంగానే వివాదంలోకి లాగారని, ఇందులో బయటి వ్యక్తులు, కొందరు టీచర్ల ప్రమేయం ఉందని తమకు సమాచారం ఉందని కౌన్సిల్ తెలిపింది.
ఈ ఘటనపై విచారణ మాత్రం కొనసాగుతుందని BCI స్పష్టం చేసింది. నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (VC) సమర్పించే విచారణ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని కౌన్సిల్ వెల్లడించింది. ఈ నివేదిక కోసం విద్యార్థుల వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని అందించాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని BCI ఆదేశించింది.
న్యాయవాద వృత్తి గౌరవం, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని విద్యార్థులకు BCI సూచించింది. భవిష్యత్తులో న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా బాధ్యతాయుతమైన పాత్రలు పోషించాల్సిన విద్యార్థులు, వృత్తి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని కౌన్సిల్ అభిప్రాయపడింది. నిషేధం ఎత్తివేతతో నల్సార్ విద్యార్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.








