నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం గణపురం స్టేజి వద్ద ఉన్న SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రధాన కాలువ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉమ్మడి పీఏ పల్లి, గుడిపల్లి మండలాల్లోని అన్ని చెరువులు, కుంటలను నీటితో నింపాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు రామావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, నల్లగొండకు వెంటనే నీటిని తరలించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నిరసన కారణంగా కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు. సాగునీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు తాము ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.