శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఇందుకూరిపల్లి శివారులోని ఒక ఫామ్‌హౌస్‌పై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ దాడుల్లో రాగి చెంబులకు రసాయనాలు పూసి, వాటికి మహిమలు ఉన్నాయని ప్రచారం చేస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు కదిరి రూరల్‌ సీఐ పి. నాగేంద్ర పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది.

ప్రధాన నిందితుడు గుత్తి దుర్గా నాగప్రసాద్‌ రాగి చెంబులపై ప్రత్యేక రసాయనాలను పూసే పద్ధతిని నేర్చుకున్నాడు. ఈ చెంబుల సమీపంలో టార్చ్‌లైట్‌ వెలిగించినప్పుడు, రసాయన చర్య వల్ల బల్బు ఫిలమెంట్‌ కాలిపోయేలా చేసి, దానిని అతీంద్రియ శక్తిగా ప్రజలను నమ్మించేవారు. గతంలో కూడా ఇదే తరహాలో పలువురిని మోసం చేసి డబ్బు సంపాదించినట్లు విచారణలో తేలింది.

నిందితుడు శేషఫణి అలియాస్‌ స్వామి తన ఫామ్‌హౌస్‌లో వీరికి ఆశ్రయం కల్పించడంతో పాటు, మోసానికి అవసరమైన ఖర్చులను భరించాడు. మిగిలిన నిందితులు కూడా ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. అరెస్ట్ అయిన వారిలో తూర్పుగోదావరి, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలతో పాటు తెలంగాణకు చెందిన వ్యక్తులు ఉన్నారు.

పోలీసులు నిందితుల నుంచి నాలుగు రాగి చెంబులు, రెండు టార్చ్‌లైట్లు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఒక మారుతి బలెనో కారు, హోండా మాస్ట్రో స్కూటీ మరియు రూ. 3,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నల్లచెరువు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.