ముంబైలోని గిర్గాం చౌపట్టి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నదీరా సుల్తానా అనే మహిళను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా, తన గుర్తింపు లేదా చిరునామా గురించి ఎటువంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోయింది. దీంతో పోలీసులు ఆమెను ఠాణాకు తరలించి విచారణ చేపట్టారు.
విచారణలో ఆమె వద్ద భారత్‌లో ఉండేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేవని తేలింది. గత నెలలోనే ఆమెను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు బహిష్కరించినట్లు (దేశం నుంచి వెలుపలికి పంపడం) పోలీసుల రికార్డుల్లో వెల్లడైంది. బహిష్కరణ జరిగిన నెల రోజులకే ఆమె మళ్లీ అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం ఆమె ఎలా తిరిగి వచ్చింది, ఎవరైనా ఆమెకు సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పరిచయాలు, ప్రయాణ వివరాలు, చరవాణి (ఫోన్) కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.








