ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం మళ్లీ జలకళను సంతరించుకుంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువ అటవీ ప్రాంతాల నుంచి ఇసుకవాగు ద్వారా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో కొండకోనల గుండా నీరు పాలధారలా కిందకు దుముకుతూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
తెలంగాణ నయాగారగా పిలువబడే ఈ జలపాత సౌందర్యాన్ని చూసేందుకు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రాంతాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా చేరుకుంటున్నారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఉప్పొంగుతున్న జలపాత దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తూ సందడి చేస్తున్నారు.
అయితే, జలపాతం వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రక్షణ వలయాలు దాటి లోతైన ప్రాంతాలకు వెళ్లవద్దని, జారే రాళ్లపైకి ఎక్కవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా సెల్ఫీల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు.
పర్యాటకుల భద్రత దృష్ట్యా జలపాతం ప్రాంగణంలో సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా పర్యాటకులను నియంత్రిస్తూ, నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.








