ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీముని పాదం జలపాతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. వరుస సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన సందర్శకులు, 50 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాన్ని చూసి పరవశించిపోతున్నారు. జలపాతాల వద్ద జలకాలాడుతూ, అటవీశాఖ ఏర్పాటు చేసిన పార్కులో, వాచ్ టవర్ వద్ద పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో జలపాతాలకు జలకళ కూడా కొంత ఆలస్యంగా వచ్చింది. గత వారం వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు, సందర్శకుల రాకను నిలిపివేశారు. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో పర్యాటకులను మళ్లీ అనుమతిస్తున్నారు.
అటవీశాఖ అధికారులు బొగత జలపాతాన్ని సందర్శించేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మిగిలిన ఆరు జలపాతాల సందర్శనపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది. ఎవరైనా దొంగదారిలో నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.








