ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురానికి చెందిన గడ్డం వేణు కుమార్ ఎలుకల మందు, ఇతర మాత్రలు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముత్తారం శివారులోని మిషన్ భగీరథ ప్లాంట్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వేణు, శనివారం రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. అయితే సాయంత్రం వేళ నిరుద్యోగుల వాట్సాప్ గ్రూపులో సూసైడ్ నోట్ పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అతడిని అపస్మారక స్థితిలో గుర్తించి, వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వేణు ఐసీయూలో చావుబతుకుల మధ్య ఉన్నాడని వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఎలుకల మందు, గుర్తు తెలియని మాత్రలను పోలీసులు గుర్తించారు.
గత ఐదేళ్లుగా గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వేణు, నోటిఫికేషన్లు సకాలంలో రాకపోవడంపై తన సూసైడ్ లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి సంవత్సరం జాబ్ కాలెండర్ ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదని, దీనివల్ల అభ్యర్థులు తమ విలువైన సమయాన్ని, వయస్సును కోల్పోతున్నారని లేఖలో పేర్కొన్నాడు. మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరాడు.
తన తల్లి మానసిక వికలాంగురాలని, తమకు సొంత ఇల్లు లేదని వేణు లేఖలో వివరించాడు. ఈ సూసైడ్ నోట్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాహుల్ గాంధీలకు చేరేలా చూడాలని కోరుతూ, తన ఆవేదనను లేఖ ద్వారా వెల్లడించాడు.







