తెలుగు క్రైమ్ కామెడీ సినిమా 'బా బా బ్లాక్ షీప్' (Baa Baa Black Sheep) షూటింగ్ పూర్తిగా మేఘాలయ రాష్ట్రంలోనే పూర్తయింది. ఇలా మేఘాలయలో చిత్రీకరణ జరుపుకున్న మొదటి దక్షిణ భారత చలనచిత్రంగా ఈ సినిమా నిలిచింది. నిర్మాత వేణు దోనెపూడి చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ మేఘాలయలో జరగడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్రాడ్ కే సంగ్మా హర్షం వ్యక్తం చేశారు. చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఆయన ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. మేఘాలయ అందాలను, అక్కడి ప్రకృతి దృశ్యాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ సినిమా ఒక మంచి అవకాశం అని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం దక్కిందని సంగ్మా తెలిపారు. మేఘాలయను షూటింగ్ గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు నిర్మాత వేణు దోనెపూడికి, చిత్ర బృందానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని సినిమాలు తీయడానికి ఇతర చిత్రనిర్మాతలను కూడా ఆహ్వానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ చిత్రంలో మరాఠీ నటుడు ఉపేంద్ర లిమాయే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు టిను ఆనంద్, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ, విస్మయ శ్రీ, మాళవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు, తుపాకులు, బంగారం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

ఒక రోజులో జరిగే ఘటనల నేపథ్యంలో ఈ క్రైమ్ కామెడీ సాగుతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించిందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా 2026 అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.