మెగా డీఎస్సీ ద్వారా చేపట్టిన ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకతతో సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా ఎ.కోడూరులో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నియామకాల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే క్రీడా కోటాను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రభుత్వం మెరిట్ ప్రాతిపదికన వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే, వైకాపా నేతలు ఓర్వలేక అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
వైకాపా నేతలు ఉపాధ్యాయులను అగౌరవపరిచేలా కోర్టులో 350కి పైగా పిటిషన్లు దాఖలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. గత వైకాపా పాలనలో ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని, గ్రూప్-1 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాలని, ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల పాలనలో కలుషిత, నకిలీ మద్యం విక్రయాల వల్ల 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది ఆరోగ్య సమస్యల బారిన పడ్డారని ఆయన ఆరోపించారు. రాష్ట్రం సర్వనాశనం కావడానికి వైకాపా విధ్వంసకర రాజకీయాలే కారణమని ఆయన ధ్వజమెత్తారు.








