మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ డివిజన్‌లోని సర్వే నంబర్ 1లో మొత్తం 18 ఎకరాల భూమి ఉంది. ఇందులో 12 ఎకరాలు దశాబ్దాల క్రితమే పట్టా భూమిగా నిర్ధారణ కావడంతో, అక్కడ ప్రజలు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. మిగిలిన 6 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో స్పష్టంగా ఉంది.
ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులు, ఆరు నెలల క్రితం ఈ 18 ఎకరాలను '22ఏ' నిషేధిత జాబితాలో చేర్చారు. '22ఏ' అనేది రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు జరగకుండా ప్రభుత్వం నిషేధించిన భూముల జాబితా. ఈ జాబితా పేరుతో స్థానికులను భయపెట్టి, కాంగ్రెస్ నేతలు అధికారుల సాయంతో అక్రమాలకు తెరలేపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే రెవెన్యూ రికార్డుల్లో అసలు ఉనికే లేని '1ఏ' అనే కొత్త సర్వే నంబర్‌ను సృష్టించారు. ఈ కొత్త నంబర్ ద్వారా నిషేధిత జాబితా నుంచి 6 ఎకరాల ప్రభుత్వ భూమిని తొలగించి, ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చే ప్రక్రియను పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో భూమి లేకపోయినా, రికార్డుల్లో మాత్రం ఈ మార్పులు జరగడం గమనార్హం.
ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు ఈ అక్రమాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను స్థానికులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఆ 6 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.








