పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఒకే రోజు పది మంది నవజాత శిశువులు మరణించారు. ఈ ఘటన ఆగస్టు రెండో వారంలో చోటుచేసుకోగా, విషయం తెలియగానే స్థానికంగా కలకలం రేగింది.
మరణించిన పది మంది శిశువులలో ఎనిమిది మందిని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌ల నుంచి ఇక్కడికి రిఫర్ (వైద్య చికిత్స కోసం వేరే ఆసుపత్రికి పంపడం) చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసేన్‌జిత్ బార్ తెలిపారు. మిగిలిన ఇద్దరు శిశువులు మాత్రమే ఈ ఆసుపత్రిలో జన్మించారని ఆయన వివరించారు.
శిశువుల మరణాలకు గల కారణాలను కూడా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శ్వాసకోశ ఇబ్బందులు, పచ్చకామెర్లు, గుండె సంబంధిత సమస్యలతో ఆ శిశువులు బాధపడుతున్నారని, తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం తమ ఆసుపత్రికి పంపారని ప్రసేన్‌జిత్ బార్ చెప్పారు.
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ స్పందించింది. దీనిపై సమగ్ర నివేదికను అందించాలని ఆసుపత్రిని ఆదేశించింది. ఇప్పటికే ఆరోగ్య శాఖకు ప్రాథమిక నివేదికను సమర్పించామని, త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను పంపిస్తామని సూపరింటెండెంట్ తెలిపారు.








