భారతీయ వంటకాల్లో రుచి కోసం వాడే మెంతుల్లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. బరువు తగ్గడానికి, షుగర్ అదుపులో ఉంచుకోవడానికి చాలామంది ఉదయాన్నే మెంతి నీళ్లు తాగడం లేదా నానబెట్టిన మెంతులు తినడం చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు అందరికీ మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

గర్భవతులు మెంతులు తీసుకోకూడదు. ఇవి గర్భాశయ సంకోచాలను ప్రేరేపించి గర్భస్రావానికి దారితీసే ప్రమాదం ఉంది. పాలిచ్చే తల్లులు కూడా వైద్యుల సలహా లేకుండా వీటిని వాడకూడదు.

ఏదైనా శస్త్రచికిత్స జరగడానికి రెండు వారాల ముందు నుంచి మెంతులు తినడం ఆపేయాలి. ఇవి రక్తం గడ్డకట్టే ప్రక్రియను మందగింపజేస్తాయి, దీనివల్ల సర్జరీ సమయంలో అధిక రక్తస్రావం జరగవచ్చు. అలాగే వార్ఫరిన్, అసిట్రోమ్ వంటి రక్తాన్ని పల్చబరిచే మందులు (బ్లడ్ థిన్నర్స్) వాడేవారు మెంతులకు దూరంగా ఉండాలి.

జీర్ణ సమస్యలు ఉన్నవారికి మెంతులు ఇబ్బంది కలిగించవచ్చు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే తరచూ కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడేవారు మెంతులు తింటే కడుపు ఉబ్బరం, నొప్పి తీవ్రమవుతాయి.

షుగర్ వ్యాధి ఉన్నవారు ఇన్సులిన్ లేదా గ్లిమెపిరైడ్ వంటి మందులు వాడుతుంటే, మెంతులు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మెంతులు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి కాబట్టి, మందులతో కలిపి తీసుకుంటే షుగర్ ప్రమాదకర స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి షుగర్ లెవల్స్‌ను నిరంతరం గమనిస్తూ ఉండాలి.

థైరాయిడ్ సమస్య కోసం మందులు వాడేవారు, ఆ మాత్ర వేసుకున్న రెండు గంటల తర్వాతే మెంతులు తీసుకోవాలి. మెంతుల్లో ఉండే ఫైబర్ థైరాయిడ్ మందుల పనితీరును అడ్డుకుంటుంది. ఏ పదార్థమైనా మోతాదుకు మించి తీసుకోకూడదని, చాలా కాలంగా ఉన్న వ్యాధులు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలని డాక్టర్ విపుల్ సూచిస్తున్నారు.