సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చిత్ర బృందం అభిమానులకు ఒక ప్రత్యేక అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా థీమ్‌తో రూపొందించిన అఫీషియల్ మర్చండైజ్ త్వరలో మార్కెట్లోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. ఇందులో భాగంగా V-Neck టీ-షర్టులు, రామ పిరమిడ్ కాన్సెప్ట్ ఉత్పత్తులు, బోర్డ్ గేమ్స్ మరియు రుద్ర లాకెట్ వంటి వస్తువులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ మర్చండైజ్ సేల్స్ ప్రారంభం కాకముందే అభిమానుల కోసం మేకర్స్ ఒక వెయిటింగ్ లిస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్నవారు varanasimovie.com వెబ్‌సైట్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ లిస్ట్‌లో చేరిన వారికి మర్చండైజ్ అప్‌డేట్లు ముందుగా అందడమే కాకుండా, వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కె.ఎల్. నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన మహేష్ బాబు, ‘వారణాసి’ తన హృదయానికి చాలా దగ్గరైన చిత్రమని, ఈ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.
ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మర్చండైజ్ ప్రచారంలో భాగంగా గతంలోనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభిమానుల కోసం ఒక గేమ్‌ను కూడా మేకర్స్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ ప్రమోషనల్ కాన్సెప్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.








