మహారాష్ట్రలోని కళ్యాణ్ గోవింద్వాడి బైపాస్ రోడ్డు వద్ద అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. సచిన్ షెండ్గే అనే క్యాబ్ డ్రైవర్ ప్రయాణికులను దింపి తిరిగి వస్తుండగా, ఇద్దరు యువతులు లిఫ్ట్ అడిగారు. రాత్రి వేళ ఇబ్బంది పడతారని భావించి డ్రైవర్ వారిని కారులో ఎక్కించుకున్నాడు.
కారు కాస్త దూరం వెళ్ళాక, ఆ యువతులు డ్రైవర్‌ను పది వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, కేసు పెడతామని వారు బెదిరించారు. అయితే డ్రైవర్ భయపడకుండా వారి బెదిరింపులను తన ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించాడు.
డ్రైవర్ కారును నేరుగా పోలీస్ స్టేషన్ వైపు మళ్లించాడు. తనను బెదిరిస్తున్న యువతుల గురించి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. డ్రైవర్ కారును నెమ్మది చేయగానే, ఆ యువతులు కారు ఆగకముందే దూకేసి అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఘటనపై బాధితుడు కోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన తర్వాత రాత్రి వేళల్లో వాహనదారులు ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై ఆందోళన వ్యక్తమవుతోంది.








