మాదాపూర్‌లోని అంజయ్య నగర్‌లో నాలా డ్రెయిన్ బాక్స్‌పై నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 50 చదరపు గజాల స్థలంలో నిబంధనలను ఉల్లంఘించి ఈ నిర్మాణాన్ని చేపట్టారు. భవనం కూలిన సమయంలో అక్కడ టైల్స్ వేస్తున్న మహతాబ్, ఉమేష్ శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

ఈ భవనం కూలి పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడటంతో ఆ భవనం పాక్షికంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న ఇద్దరికి గాయాలవ్వడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. భవనం పక్కనే ఉన్న హాస్టల్ కూడా దెబ్బతినడంతో, అందులో ఉంటున్న విద్యార్థులను అధికారులు వెంటనే ఖాళీ చేయించారు.

ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అలాగే, ఆపద సమయంలో సహాయం అందించే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు, హైడ్రా (HYDRA - హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రభుత్వ విభాగం) అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని హై-ఎండ్ రెస్క్యూ పరికరాలతో సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగించారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. శ్రీజన, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. శిథిలాల నుంచి రెండు మృతదేహాలను బయటకు తీశామని రంగనాథ్ మీడియాకు తెలిపారు. సాజిద్ అనే బిల్డర్ చిన్న చిన్న స్థలాల్లో ఇలాంటి అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ ప్రమాదంపై విచారణ జరిపి, బాధ్యులైన బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. భవన యజమానుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రమాదం సాయంత్రం వేళ జరిగి ఉంటే ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.