క్షణికమైన ఆనందం కోసం మత్తు పదార్థాలకు అలవాటు పడటం ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వ్యక్తిగత జీవితాన్ని అంధకారంలోకి నెట్టే డ్రగ్స్ బారిన పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శారీరక, మానసిక దృఢత్వంతో మత్తుకు దూరంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
మాదకద్రవ్య రహిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి కుటుంబం, సమాజం కలిసి రావాలని ప్రధాని కోరారు. డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడిన వారిని సమాజం గౌరవంతో అక్కున చేర్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. యోగ, ధ్యానం, ఆత్మవిశ్వాసం మరియు దృఢచిత్తం ద్వారా మత్తు పదార్థాలకు స్వస్తి పలకవచ్చని మోదీ వివరించారు. నషా ముక్త్ యువ ఫర్ వికసిత భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లకు ప్రధాని పిలుపునిచ్చారు. మరోవైపు, వీధి వ్యాపారుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి యోజన గురించి ఆయన ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా సుమారు 46 శాతం మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటున్నారని మోదీ గుర్తుచేశారు.








