మచిలీపట్నంకు చెందిన అమ్మిరెడ్డి రజనిపై చిలకలపూడి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. చల్లపల్లి మండలానికి చెందిన ఒక మహిళ తన రెండో భర్త అమీన్ వేధింపుల గురించి రజనిని ఆశ్రయించగా, ఆమె కౌన్సెలింగ్ పేరుతో ఇద్దరినీ కార్యాలయానికి పిలిపించారు. అయితే, మరుసటి రోజు రజని తన వైఖరి మార్చుకుని బాధితురాలినే నిందించడం మొదలుపెట్టారు.
బాధితురాలి నుంచి మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్న రజని, జిల్లా ఎస్పీ తనకు బాగా తెలుసని బెదిరించారు. తనపై దొంగతనం కేసు పెట్టి జైలుకు పంపిస్తానని భయపెట్టి, ఫోన్ పే ద్వారా రూ. 40,000 నగదును, ఐదు గ్రాముల బంగారాన్ని బలవంతంగా తీసుకున్నారు. దీంతో బాధితురాలు చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో రజనిపై ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు విచారణకు ఆదేశించగా, చిలకలపూడి సీఐ ఎస్‌కే నభీ దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు, రజనిని అరెస్ట్ చేశారు. ఆమె కార్యాలయం నుంచి సీసీ ఫుటేజ్, కంప్యూటర్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
గురువారం రజనిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ విషయాన్ని సీఐ నభీ వెల్లడించారు.








