యాదాద్రి, వెలుగు: ల్యాబ్‌ను అద్దెకు తీసుకుని గుట్టుగా సాగిస్తున్న డ్రగ్స్‌దందా బట్టబయలైంది. ఎవరికీ అనుమానం రాకుండా పరిశ్రమ ముసుగులో మెఫిడ్రిన్ తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను యాదాద్రి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫిడ్రిన్‌ను నాగ్‌పూర్‌కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ తయారీకి ఉపయోగించే 40 కిలోల అసిటోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో వేటుకూరి రామరాజు ఆరేండ్ల కిందట ‘వేటుకూరి ల్యాబ్స్’ ఏర్పాటు చేశారు. మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కింద నమోదైన ఈ సంస్థలో మెడిసిన్, బొటానికల్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు తయారు చేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది. హెన్నా తయారీ కూడా చేస్తున్నట్లు సంస్థ రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్నారు. ల్యాబ్‌ను ఇతరులకు రోజువారీ ప్రాతిపదికన అద్దెకు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన డ్రగ్ తయారీ నిర్వాహకుడు చేతన్ మధుకర్ మెష్రామ్ తన సహచరులతో కలిసి మెడిసిన్ ఉత్పత్తులు తయారు చేస్తామని చెప్పి ఈ నెల 5 నుంచి కొన్ని రోజులపాటు ల్యాబ్‌ను అద్దెకు తీసుకున్నాడు. అనంతరం అక్కడ మెఫిడ్రిన్ తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మెఫిడ్రిన్ తయారీకి అస్సోంకు చెందిన ఎండీ అయూబ్ అలీ ముడి పదార్థాలను సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. అస్సోంలోని మారిగావ్‌కు చెందిన ముజామల్ హక్, హైదరాబాద్ చందానగర్‌కు చెందిన ఉపద్రష్ట రమణమూర్తి తయారీలో సహకరించినట్లు గుర్తించారు. తయారైన డ్రగ్‌ను నాగ్‌పూర్‌కు తరలించే బాధ్యతను మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ అశోక్ గవాండే తీసుకున్నట్లు వెల్లడించారు.
ల్యాబ్‌లో తయారు చేసిన మెఫిడ్రిన్‌ను కారులో నాగ్‌పూర్‌కు తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్వోటీ, బీబీనగర్ పోలీసులు ఈ నెల 8న కొండమడుగులో వాహన తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న ఫార్చునర్ కారును ఆపి తనిఖీ చేయగా 27 కిలోల మెఫిడ్రిన్, 40 కిలోల అసిటోన్ లభించాయి.
వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి విచారణలో కొండమడుగులోని వేటుకూరి ల్యాబ్స్‌లోనే డ్రగ్ తయారు చేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ల్యాబ్‌పై సోదాలు నిర్వహించారు. డ్రగ్ తయారీకి ఉపయోగించిన రియాక్టర్, సెంట్రిఫ్యూజ్ సహా పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
చేతన్ మధుకర్ మెష్రామ్, ముజామల్ హక్, ఆకాశ్ అశోక్ గవాండే, ఉపద్రష్ట రమణమూర్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎండీ అయూబ్ అలీ, నాగ్‌పూర్‌కు చెందిన డ్రగ్ పెడ్లర్ చందా ప్రదీప్ ఠాకూర్, గోపాల్ సిర్పట్ పటేలియా, ల్యాబ్ యజమాని వేటుకూరి రామరాజు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.








