ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జూన్ 20) పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడతను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానం ద్వారా దేశవ్యాప్తంగా 9.44 కోట్లకు పైగా రైతు కుటుంబాల ఖాతాల్లో సుమారు రూ. 18,880 కోట్లు జమ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది డబుల్ గుడ్ న్యూస్ కాగా, పీఎం కిసాన్ కింద రూ. 2వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం నిధులు రూ. 7వేలు కూడా వారి ఖాతాల్లో చేరాయి.
అయితే, కొంతమంది రైతులకు ఈ నిధులు అందకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నపాటి లోపాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆధార్‌తో బ్యాంక్ ఖాతా లింక్ కాకపోవడం, ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తికాకపోవడం లేదా భూమి రికార్డుల్లో వివరాలు సరిపోకపోవడం వంటి అంశాలు డబ్బులు జమ కాకపోవడానికి దారితీస్తున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి రైతులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ లేదా గ్రామ సచివాలయంలో తమ పేమెంట్ స్టేటస్‌ను పరిశీలించాలి. అక్కడ 'Rejected/Pending/On Hold' అని చూపిస్తే, సమస్య గుర్తించి వెంటనే పరిష్కరించుకోవచ్చు. ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉంటే దగ్గరలోని రైతు సర్వీసు సెంటర్ లేదా సచివాలయంలో బయోమెట్రిక్ ద్వారా దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయిందా, ఐఎఫ్‌ఎస్‌సీ (IFSC) కోడ్ సరిగ్గా ఉందా అని కూడా తనిఖీ చేసుకోవాలి.
భూమి రికార్డుల్లో పట్టా పేరు లేదా సర్వే నంబర్ తప్పుగా ఉంటే, వెంటనే రెవెన్యూ అధికారులను సంప్రదించి వివరాలను సరిదిద్దుకోవాలి. ఈ చర్యలు తీసుకున్న తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే, గ్రామ సచివాలయం లేదా పీఎం కిసాన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి టికెట్ నంబర్ తీసుకుని ఫాలోఅప్ చేయాలి. సరైన ప్రక్రియలు పాటిస్తే 7 నుంచి 15 రోజుల్లో సమస్య పరిష్కారమై, నిధులు ఖాతాలో జమ అవుతాయి.







