అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగే మొండిఘటం అని వర్ణించారు. శనివారం వాషింగ్టన్‌లో యాక్సియస్‌ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 (జి7 - ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ఏడు దేశాల సమూహం) శిఖరాగ్ర సదస్సు వేళ మోదీని పొగిడిన మూడ్రోజులకే ట్రంప్‌ మరోసారి ఆయనను ప్రశంసించడం గమనార్హం.

మోదీ ఎంతో మంచి వ్యక్తి అని, యుద్ధాలను దూరంగా ఉంచుకోవడం ఆయన తీసుకున్న తెలివైన నిర్ణయమని ట్రంప్‌ అన్నారు. 150 కోట్ల మంది జనం అండగా ఉండటం వల్ల ఆయన బడానేతగా ఎదిగారని, వాస్తవానికి భారత్‌ అతిపెద్ద దేశమని, మోదీ గొప్ప నాయకుడని కొనియాడారు. భారత్‌తో తమ దేశం పెద్ద మొత్తంలో వాణిజ్యకార్యకలాపాలు కొనసాగిస్తున్నదని, గతంలో కంటే ఇప్పుడు వ్యాపారం మరింత పెరిగిందని, అత్యంత పారదర్శకంగా జరుగుతున్నదని తెలిపారు.

అధికారం, మధ్యవర్తిత్వం, దౌత్యం నెరిపే ఒడుపు, సత్ఫలితాలను సాధించే సత్తా ఉన్న నేతల పేర్లు చెప్పాలని యాక్సియస్‌ సంస్థ ప్రతినిధి అడగ్గా.. మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తమకు నచ్చుతారని ట్రంప్‌ స్పష్టం చేశారు. వీరిద్దరి ఘనతను చాటేలా సినిమా తీయాలంటే, అచ్చం వీళ్లలా వేషభాషలు, హావభావాలు పలికించే అద్భుత నటుడు హాలీవుడ్‌లో లేరని వ్యాఖ్యానించారు. మోదీ పైకి సౌమ్యంగా కన్పించినా, అనుకున్నది సాధించేదిదాకా వదలని ఘటికుడని, ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉన్నదని అన్నారు.

భారత్‌ను దశాబ్దాలుగా గమనిస్తున్నానని, అప్పట్లో ప్రభుత్వాలు ఆరు నెలలు, ఏడాదికే మారిపోయేవని, కానీ మోదీ రాకతో ఈ పరిస్థితి మారిపోయిందని ట్రంప్‌ వివరించారు. గత 12 ఏళ్లుగా మోదీనే పరిపాలిస్తూ స్థిరమైన పాలన అందించారని, చూడ్డానికి శాంతంగా కన్పించినా ఆయన దృఢమైన వ్యక్తి అని అభివర్ణించారు. అదే సమయంలో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంటే కూడా తనకు ఇష్టమని తెలిపారు.