అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరంలో ప్రాణప్రతిష్ట జరిగిన సందర్భంగా సమర్పించిన 60 కేజీల వెండి వస్తువుల ఆచూకీ లభించడం లేదు. ఈ విరాళాన్ని అందించిన ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనురాగ్ రస్తోగీ, ఆలయ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి భక్తులు అందించిన విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది.
రసీదుల ప్రకారం మొత్తం 60 కేజీల వెండిని దానం చేశారు. ఇందులో 4.62 కేజీల బరువున్న నాలుగు పెద్ద వెండి ఇటుకలు, 34.64 కేజీల బరువున్న 30 వెండి వస్తువులు ఉన్నాయి. కానీ ఆలయ విరాళాల రికార్డుల్లో ఈ వస్తువులు ఎక్కడ ఉన్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో ఈ విషయమై తీవ్ర వివాదం చెలరేగింది.
ఈ నేపథ్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గత ఆరు రోజులుగా ఈ వెండి వస్తువుల కోసం గాలిస్తున్నా ఫలితం లేకపోయింది. విచారణలో భాగంగా అధికారులు రామ్‌లల్లా ఆలయంలో బంగారం, విరాళాల బాధ్యతలు చూసుకునే రాంశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, కృష్ణదేవ్ తివారీతో పాటు మరో నలుగురు పూజారులను ప్రశ్నించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ వస్తువుల జాడ మాత్రం కనిపెట్టలేకపోయారు.







