ప్రపంచ యోగా దినోత్సవం, ఫాదర్స్ డే ఒకే రోజు సందర్భంగా నలభై ఏండ్లు దాటిన తండ్రుల ఆరోగ్యం కోసం నాలుగు యోగాసనాలను సాధన చేయాలని సూచించారు. కుటుంబ బాధ్యతలతో పాటు వయసు పైబడటం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను నివారించేందుకు ఈ ఆసనాలు దోహదపడతాయి.

మానసిక ఒత్తిడి, హైబీపీ (అధిక రక్తపోటు) తగ్గేందుకు 'విపరీత కరణి' ఆసనం ఉపయోగపడుతుంది. గోడకు దగ్గరగా పడుకుని కాళ్లను గోడపై నిలువుగా ఉంచి, చేతులను పక్కకు చాపి విశ్రాంతి తీసుకోవాలి. ఇది గుండెకు రక్త ప్రసరణను సులభతరం చేసి, శారీరక అలసటను పోగొడుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంచేందుకు 'అర్ధ మత్స్యేంద్రాసనం' సహాయపడుతుంది. కూర్చుని ఒక కాలు మడిచి, మరో కాలు మోకాలి అవతలి వైపు ఉంచి శరీరాన్ని వెనక్కి తిప్పడం వల్ల క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.

నడుము నొప్పి నుంచి ఉపశమనం కోసం 'శలభాసనం' అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. బోర్లా పడుకుని చేతులను తొడల కింద ఉంచి, శ్వాస తీసుకుంటూ మోకాలు వంచకుండా కాళ్లను పైకి లేపాలి. ఇది సయాటికా నరం మీద ఉన్న ఒత్తిడిని తగ్గించి, నడుము కండరాలను బలోపేతం చేస్తుంది. మోకాళ్ల సమస్యలతో బాధపడేవారికి 'జాను శీర్షాసనం' మంచిది. కూర్చుని ఒక కాలు చాపి, మరో కాలు మడిచి పాదాన్ని చాచిన కాలు తొడకు ఆనించి, నెమ్మదిగా ముందుకు వంగి వేళ్లను అందుకోవాలి. ఇది తొడ వెనుక భాగం, పిక్కల కండరాలను సాగదీసి మోకాళ్ల చుట్టూ ఉన్న గట్టితనాన్ని తగ్గిస్తుంది.

నలభై ఏండ్లు దాటినవారు ఈ ఆసనాలను నిదానంగా, ప్రశాంతమైన శ్వాసతో చేయాలి. రోజుకు 30 నిమిషాలు సాధన చేస్తే చాలు, ప్రతి ఆసనంలో 20 సెకన్లు స్థిరంగా ఉండాలి. చివరి 5 నిమిషాలు 'శవాసనంలో' (శవం లాగా పడుకునే ఆసనం) విశ్రాంతి తీసుకోవాలి. గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రశాంతమైన ప్రదేశంలో, టీవీ శబ్దాలు లేని చోట సాధన చేయడం ఉత్తమం. శరీరాన్ని బలవంత పెట్టకుండా, నొప్పి రానంత వరకే నెమ్మదిగా సాధన చేయాలి.