కర్నూలులో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో మంత్రి టీజీ భరత్ పోలీసు శాఖపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యకు ముందే సోషల్ మీడియాలో నిందితులు పోస్టులు పెట్టినా పోలీసులు గుర్తించలేదని ఆయన మండిపడ్డారు. మంత్రుల కదలికలపై నిఘా ఉంచే పోలీసులు, నేరస్థుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ నేతల అక్రమాలను, హంద్రీ నదిలో భూకబ్జాలను ప్రశ్నించినందుకే ఇంతియాజ్‌ను పథకం ప్రకారం హత్య చేశారని మంత్రి ఆరోపించారు. కర్నూలు ఓల్డ్ సిటీలో తన పర్యటన సందర్భంగా రౌడీ షీటర్లు అసభ్యంగా ప్రవర్తించారని, వారిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లలో కర్నూలులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆయన గుర్తు చేశారు.
మంత్రి వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో భిన్నమైన చర్చలు మొదలయ్యాయి. సొంత పార్టీ అధికారంలో ఉన్నా, జిల్లా పోలీసు అధికారులు తన మాట వినడం లేదనే అసహనంతోనే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని మంత్రి ఇప్పటికే ప్రకటించారు.
ప్రతిపక్ష వైసీపీ నేతలను ఉద్దేశించి కూడా మంత్రి ఘాటుగా స్పందించారు. అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదని, తన క్యాడర్‌ను రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులపై ఒత్తిడి పెంచేందుకే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







