జగిత్యాల్ వైపు వెళ్తున్న TSRTC బస్సును, ఎదురుగా వేగంగా వచ్చిన లారీ కొండగట్టు సమీపంలో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు.

స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 25 మందిని 108 అత్యవసర వైద్య సేవల వాహనాల్లో జగిత్యాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లేదా హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అద్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ ఘటనపై స్పందించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్ల సాయంతో దెబ్బతిన్న వాహనాలను తొలగించి రాకపోకలను మళ్లీ ప్రారంభించారు. లారీ వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.