ఖలీల్‌వాడిలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పీఆర్టీయూ (PRTU - ఉపాధ్యాయుల సంఘం) జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సంఘం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.

ఈ ఎన్నికల్లో మొత్తం 366 ఓట్లు ఉండగా, వివిధ మండలాల నుంచి వచ్చిన 358 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవి కోసం ఎంబెల్లి శంకర్, పొద్దుటూరి మోహన్‌రెడ్డి పోటీ పడ్డారు.

ప్రధాన కార్యదర్శి పదవికి గంట అశోక్, గంగోని కిషన్, ఎం వెంకటేశ్వర్‌గౌడ్ పోటీలో నిలిచారు. అసోసియేట్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి స్థానాలకు కూడా పలువురు అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే, మహిళా కమిటీ సభ్యుల ఎన్నిక మాత్రం ఏకగ్రీవంగా ముగిసింది.

పోలింగ్ ముగిసిన తర్వాత రౌండ్ల వారీగా కౌంటింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది. మోహన్‌రెడ్డి, శంకర్ మధ్య ప్రతి రౌండ్‌లోనూ హోరాహోరీగా పోటీ నడిచింది. చివరకు ఎంబెల్లి శంకర్ తన ప్రత్యర్థిపై 11 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.