పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం, రచ్చపల్లి గ్రామాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్‌కు రైతుల కష్టాలు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన పరామర్శల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మంత్రి తీవ్రస్థాయిలో విమర్శించారు.
గతంలో కొండగట్టు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధితులను ఎందుకు పరామర్శించలేదని లక్ష్మణ్ కుమార్ నిలదీశారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు తమ బాధ్యతలను విస్మరించి, చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.
నంది మేడారం, రచ్చపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలన్నింటినీ నిలబెట్టుకుంటుందని, పేదలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అనవసర విమర్శలను మానుకోవాలని ఆయన హెచ్చరించారు.







