నీట్ పేపర్ లీక్ నిరసనల్లో అరెస్టైన విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను (FIR) ఉపసంహరించుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్రానికి మంగళవారం అల్టిమేటం జారీ చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఎటువంటి శిక్షాత్మక చర్యలు తీసుకోబోమని కేంద్రం గతంలో హామీ ఇచ్చిందని, ఆ హామీ నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందని సీజేపీ ఆరోపించింది.

నిరసనలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 18 ఏళ్లలోపు వయసు ఉండి, నేర చరిత్ర లేని విద్యార్థులను విడుదల చేయాలని రాష్ట్రాలను ఆదేశించిన కోర్టు, సీజేపీ నేతృత్వంలో జరిగిన నిరసనలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో బలవంతపు చర్యలు తీసుకోవద్దని సూచించింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వాలు దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉండటంతో సీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రభుత్వ న్యాయవాదులు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ ఒప్పందాన్ని సుప్రీంకోర్టుకు ఎందుకు తెలియజేయలేదని సీజేపీ ప్రశ్నిస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఎక్కడా ఆదేశించలేదని పార్టీ స్పష్టం చేసింది. విద్యార్థుల వేధింపులు కొనసాగితే భారీ శాంతియుత నిరసనలతో స్పందిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే హెచ్చరించారు.

మంగళవారం లోపు విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోకపోతే, దేశవ్యాప్తంగా మళ్లీ నిరసనలు చేపడతామని సీజేపీ ప్రకటించింది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం మరియు వేధించడం వెంటనే ఆపాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.