కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయాల్లో వాహనాల వినియోగంపై కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 'ఒక అధికారికి ఒకే ప్రభుత్వ కారు' అనే విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. గతంలో ఒక అధికారికి అదనపు శాఖల బాధ్యతలు ఉన్నప్పుడు, ఆయా శాఖల నుంచి వేర్వేరు కార్లను వినియోగించుకునే అవకాశం ఉండేది. ఇకపై ఆ వెసులుబాటు ఉండదు.

కొత్త నిబంధనల ప్రకారం, ఒక అధికారి ఎన్ని మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలను పర్యవేక్షించినప్పటికీ, వారికి కేవలం ఒక కారును మాత్రమే కేటాయిస్తారు. అదనపు శాఖలు ఉన్నంత మాత్రాన అదనపు వాహనాలను వాడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2022 సెప్టెంబర్‌లో విడుదల చేసిన మార్గదర్శకాలకు అదనంగా ఈ కొత్త నిబంధనలను చేర్చారు.

ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ వాహనాల దుర్వినియోగం ఆగుతుందని, రవాణా ఖర్చులు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. ఈ నిబంధనల అమలు వల్ల మిగిలిపోయే వాహనాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది. వీటిని అనధికారికంగా వినియోగించడానికి వీలుండదు. ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించడమే ఈ కొత్త మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం.