పంజాబ్ రాష్ట్రం లుధియానా జిల్లా సమ్రాలాకు చెందిన 23 ఏళ్ల దమన్‌ప్రీత్ కౌర్ కెనడాలోని ఎడ్మంటన్, సిల్వర్‌బెర్రీ నగరంలో దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. ఐదేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై కెనడా వెళ్లిన ఆమె, తన సహజీవన భాగస్వామితో కలిసి నివసిస్తోంది.
జూలై 9న అపస్మారక స్థితిలో, అనుమానాస్పద గాయాలతో ఉన్న దమన్‌ప్రీత్‌ను పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూలై 12న ఆమె మరణించింది. పోస్టుమార్టం నివేదికలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ హత్యకు సంబంధించి దమన్‌ప్రీత్‌తో కలిసి ఉంటున్న 22 ఏళ్ల భారతీయుడు రితిష్ కుమార్‌ను జూలై 22న పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై సెకండ్-డిగ్రీ హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది సన్నిహిత భాగస్వామి చేసిన హత్యేనని, ఇందులో ఇతరుల ప్రమేయం లేదని వారు స్పష్టం చేశారు.
కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఆ కుటుంబం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం GoFundMe ద్వారా నిధుల సేకరణ చేపట్టగా, అవసరమైన $20,000 డాలర్లలో ఇప్పటికే $18,000 డాలర్లకు పైగా విరాళాలు అందాయి.








