సౌత్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేసే మున్నాలాల్‌ను అతని భార్య మంజు, ప్రియుడు చమన్ కలిసి ఈ నెల 10న హత్య చేశారు. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ, భర్తను అడ్డు తొలగించుకోవాలని మంజు ఈ పథకం వేసింది.

హత్య రోజున మంజు తన భర్త తాగే నీటిలో మత్తుమందు కలిపి ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయాక, ప్రియుడితో కలిసి గొంతు నొక్కి, కరెంట్ షాక్ ఇచ్చి, కర్రతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఇంట్లో దొంగలు పడి భర్తను చంపారని మంజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా, అర్ధరాత్రి 1:45 గంటలకు ముసుగు వేసుకున్న వ్యక్తి ఇంట్లోకి వచ్చి, తెల్లవారుజామున 3:15 గంటలకు బయటకు వెళ్లడం కనిపించింది. దీంతో మంజును పోలీసులు విచారించగా, అసలు విషయం బయటపడింది.

భర్తను చంపేందుకు ప్రియుడికి రూ. 5 లక్షలు ఇస్తానని మంజు ఒప్పందం చేసుకుంది. హత్య జరిగిన తర్వాత ప్రియుడికి రూ. 20,000 ఇచ్చింది. ఈ కేసులో మంజు, ఆమె ప్రియుడు చమన్ మరియు వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.